మనం తీసినందుకు చాలా గర్వంగా వుంది! - Nag - TELUGU WATCH
Headlines News :

.

Home » » మనం తీసినందుకు చాలా గర్వంగా వుంది! - Nag

మనం తీసినందుకు చాలా గర్వంగా వుంది! - Nag

Written By BLOGGEr on Monday, May 19, 2014 | 6:51 AM

మనం నాకే కాదు మా కుటుంబసభ్యులతో పాటు మా యూనిట్‌కూ చాలా ప్రత్యేకమైన సినిమా. చాలా ప్రేమతో తీసిన చిత్రమిది. సినిమా హిట్టవ్వాలి..రికార్డులు సష్టించాలి అన్న ఆలోచనతో కాకుండా ఓ మంచి సినిమా తీద్దాం అన్న ఆలోచనతో చేసిన సినిమా మనం అన్నారు నాగార్జున. అక్కినేని మూడు తరాల కథానాయకులు కలిసి నటించి చిత్రం మనం. విక్రమ్.కె.కుమార్ దర్శకుడు. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున హైదరాబాద్‌లో పాత్రికేయులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. రిలీజ్‌కు ముందే ఓవర్సీస్ ప్రింట్లు పంపించాలి. అందుకే శనివారం రాత్రి సినిమా చూశాను. సినిమా అంతా చాలా ఎక్స్‌ట్రార్డినరీగా వచ్చింది. చాలా రోజుల తరువాత ఈ సినిమా విషయంలో చాలా సంతప్తిగా వున్నాను. 
సినిమాను కుటుంబసభ్యులంతా కలిసి చూశారా?

నేనూ,అమల, మా ఇద్దరబ్బాయిలు కలిసి చూశాం. 

మనం సినిమా ఎలా వుండబోతోంది?

ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా వుంటాయి. ఎంటర్‌టైన్ చేస్తూనే ఫ్యామిలీ ఆడియన్స్‌ని కొంతసేపు ఏడిపించి కొంత సేపు నవ్వించే సినిమా ఇది. మెలోడ్రామా లేకుండా చూసిన ప్రతి ఒక్కరికీ మంచి సినిమా చూశామన్న గుడ్ ఫీలింగ్ కలిగిస్తుంది. అత్యున్నతమైన నిర్మాణ విలువలతో పాటు డైరెక్షన్, ఎడిటింగ్, సంగీతం పరంగా చాలా కొత్తగా వుంటుంది. అనూప్ రూబెన్స్‌కు బెస్ట్ సినిమా అవుతుంది. ఇటీవల విడుదలైన పాటలు ఇప్పటికే విశేష ఆదరణ పొందుతున్నాయి. ముందు పాటలువిన్న వారు ఏంటీ చాలా స్లోగా వున్నాయి అన్నారు. కానీ ప్రస్తుతం ఏ క్లాస్ ప్రేక్షకుల నుంచి సీ క్లాస్ వరకు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. 

ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాల్లో మనం చాలా ప్రత్యేకమైనది?

నాకే కాదు నా ఫ్యామిలీతో పాటు మా యూనిట్‌కూ చాలా ప్రత్యేకమైన సినిమా ఇది. చాలా ప్రేమతో తీశాం. సినిమా హిట్టవ్వాలి..రికార్డులు సష్టించాలి అన్న ఆలోచనతో కాకుండా ఓ మంచి సినిమా తీద్దాం అన్న ఆలోచనతో చేసిన సినిమా ఇది. 

మనం ప్రయాణం ఎలా మొదలైంది?

గత మూడు నాలుగేళ్లుగా మా ముగ్గురి కలయికలో ఓ సినిమా చేయాలని ఆలోచిస్తున్నాను. అయితే ఇష్క్ సినిమా షూటింగ్‌లో ఓ కథ విన్న నిర్మాత ఎన్.సుధాకర్‌రెడ్డిగారు అది మా కుటుంబానికైతేనే బాగుంటుందని నమ్మి నా దగ్గరికి దర్శకుడు విక్రమ్ కుమార్‌ను పంపించారు. కథ విన్నాను. నాకు బాగా నచ్చింది. నాగచైతన్య విన్నాడు వాడికీ నచ్చేసింది. తరువాత నాన్నకు చెప్పించాం. ఆయనకీ బాగా నచ్చింది. ఓకే అన్న తరువాత విక్రమ్ ఈ కథపై ఏడాది వర్క్ చేసి తీసుకొచ్చాడు.


మనం పునర్జన్మల నేపథ్యంలో సాగుతుందని తెలిసింది?

ఉమ్మడి కుటుబ విలువలతో పాటు మావవీయ సంబంధాల నేపథ్యంలో సాగే సినిమా ఇది. మనిషిని సష్టించిన ఆ దేవుడే ప్రేమను, మనసును సష్టించాడు. మనిషి ప్రాణానికి పరిమితులు పెట్టగలిగిన ఆ దేవుడు మనసుకు, ప్రేమకు ఎందుకు పరిమితులు పెట్టలేకపోయాడు. వీటినే మళ్లీ మళ్లీ ఎందుకు సష్టించాడు? ప్రేమ, అనుబంధాల కోసం అనుక్షణం తపించే మనసున్న మనిషి ప్రయాణం ఏ గమ్యానికి చేరుతుంది? అన్నదే మా చిత్ర కథ. కథలో షాకింగ్ ఎలిమెంట్స్ చాలా వున్నాయి. మనం కథ 1920 మొదలై 2013కు ముగుస్తుంది. ఈ ప్రయాణంలోనే రెండు జన్మల కథ చూపిస్తున్నాం. ఇందులో కుటుంబ భావోద్వేగాల్ని, ప్రేమని, దర్శకుడు విక్రమ్ తెరకెక్కించిన తీరు అద్భుతం. 

సినిమాలో అమితాబ్ నటిస్తారన్న విషయం నాగేశ్వరరావుగారికి తెలుసా?

నాన్నకు అమితాబ్ అంటే చాలా ఇష్టం. మనకున్న గ్రేట్ నటుల్లో అమితాబ్ శైలి ప్రత్యేకమైనది. డైలాగ్ డెలివరీ, భాషపై ఆయనకున్నపట్టు అద్భుతం అని నాన్నగారు అమితాబ్ గురించి చెప్పేవారు. అది దష్టిలో పెట్టుకుని మనంలో ఓ చిన్న పాత్ర చేయమని అమితాబ్‌కు ఓ లెటర్ రాశాను. మూడు తరాల నటులు కలిసి నటిస్తున్న చిత్రంలో తనకు నటించే అవకాశం కల్పించారని కతజ్ఞతలు చెప్పారాయన. ఆయనది కథను మలుపు తిప్పే పాత్ర కాదు. ఒక నిమిషం కనిపించే చిన్న అతిథి పాత్ర మాత్రమే. 

ఈ సినిమాకు సంబంధించి ప్రత్యేకమైన జ్ఞాపకాలు ఏమైనా వున్నాయా?

చాలా వున్నాయి. అవన్నీ సినిమా విడుదల తరువాత చెబుతాం. అయితే ఓ మధుర జ్ఞాపకం ఏమిటంటే...ఇటీవల మేంవిడుదల చేసిన ట్రైలర్ చివరలో నాన్న ఒక సన్నివేశంలో కనిపిస్తారు. ఆయన నటించిన చిట్టచివరి సన్నివేశమదే. 


25 ఏళ్ల సినీ ప్రయాణంలో మనం మీకు ఎలాంటి సినిమా కాబోతోంది?

ఇన్నేళ్ల నా కెరీర్‌లో శివ, గీతాంజలి సినిమాలు ల్యాండ్ మార్క్ చిత్రాలుగా నిలిచాయి. ఈ రెండు సినిమాల తరువాత ఆ స్థాయిలో నిలిచే చిత్రమిది. ఈ సినిమా తీసినందుకు చాలా గర్వంగా వుంది. నిన్ననే భాయ్ చేశాను. ఇవ్వాళ మనం చేశాను. ఏమైంది నాకు? నా మైండ్ ఎలా గాడితప్పింది? అన్న ఆలోచన నాలో మొదలైంది. సినిమాల విషయంలో జాగ్రత్తగా లేకపోతే ప్రతికూల ఫలితాల్ని ఎదుర్కొవాల్సి వస్తుందని భాయ్ సినిమా ఫలితం నిరూపించింది. ఇందులో ఎవరి తప్పులేదు. అదంతా నా తప్పే.

రెండు రాష్టాల్లో ఎన్నికల ఫలితాలను ముందే ఊహించారా?

తెలంగాణలో టీఆర్‌ఎస్ విజయం సాధిస్తుందని ముందే ఊహించాను. అదే జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అటు ఇటు పోరు టైట్‌గా మారుతూవచ్చింది. 

అమల బీజేపి తరుపున పోటీచేస్తారని ప్రచారం జరిగింది. ఆ తరువాత విరమించుకోవడానికి కారణం?

అమలకు, నాకు రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన వన్ పర్సెంట్ కూడా లేదు. ఇదంతా ఎవరో చేసిన ప్రచారం అంతే. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. సినిమాల నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించి పేరుతెచ్చుకుంది నా దష్టిలో ఇద్దరే ఇద్దరు. ఒకరు ఎమ్‌జీఆర్, మరొకరు ఎన్టీరామారావు. 

మణిరత్నం దర్శకత్వంలో సినిమా చేస్తున్నారా?


సినిమాకు సంబంధించిన చర్చలు జరిగాయి. ఏమైందో తెలియదు ఓ రోజు మణిరత్నం ఫోన్ చేసి సినిమా చేయడంలేదని సారీ చెప్పారు. నా కెరీర్‌ను మలుపు తిప్పిన గీతాంజలి వంటి చిత్రాన్ని అందించిన ఆయనతో అవకాశం వస్తే మళ్లీ కలిసి పనిచేస్తాను. 


ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేయబోతున్నారని తెలిసింది?

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తారక్(ఎన్టీఆర్)తో కలిసి ఓ సినిమా చేయబోతున్నాను. ఇందులో నా పాత్ర చాలా షాకింగ్‌గా వుంటుంది. 

విజయ్, మోహన్‌లాల్ నటించిన జిల్లా రీమేక్ అంటున్నారు. ఇది ఎంత వరకు నిజం?

రీమేక్ కాదు. కొత్త కథతో ఈ సినిమా చేయబోతున్నాం. 

అభిమానుల కోసం మనం ప్రీమియర్ షో వేస్తున్నారని తెలిసింది?

సినిమా రిలీజ్‌కు ఒక్కరోజు ముందు అంటే ఈ నెల 22న అభిమానుల కోసం ప్రిమియర్ షోలు వేస్తున్నాం. ఇందు కోసం మొత్తం ఐదు థియేటర్లు సిద్ధం చేయించాం. 

అక్కినేని అవార్డ్స్‌ని యదావిధిగా కొనసాగిస్తారా?


నాన్న జయంతి రోజున అవార్డుల వేడుకని ఇక నుంచి ప్రతి ఏడాది నిర్వహించాలనుకుంటున్నాం. 

మీ నాన్నగారి జ్ఞాపకార్థం ఏమైనా చేయబోతున్నారా?


స్టూడియో మధ్యలో వున్న గ్యాలరీ అంటే నాన్నకు చాలా ఇష్టం. నాన్న, అమ్మ ఇద్దరి జ్ఞాపకాలతో అన్నపూర్ణ స్టూడియోలో ఓ మ్యూజియం కట్టించాలన్న ఆలోచన వుంది. దానికి కొంత సమయం పడుతుంది.




source: Namasthetelangaana


Share this article :

0 comments:

Speak up your mind

Tell us what you're thinking... !

"Congrats to K Chandrasekhar Rao Garu on taking oath as Telangana's 1st CM"

LIVE CRICKET: IPL T20

.

 
Support : Creating Website | Johny Template | Mas Template
Proudly powered by Blogger
Copyright © 2011. TELUGU WATCH - All Rights Reserved
Template Design by Creating Website Published by Mas Template